కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో బిజెపికి షాక్ ఇచ్చారు. ఆయన శనివారం నాడు పశ్చిమ బెంగాల్ లోని అధికార టీఎంసీలో చేరారు. బాబుల్ సుప్రియో తనను మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి కలకలం రేపారు. కానీ అధిష్టానం జోక్యంతో మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు ఏకంగా టీఎంసీలో చేరటంతో బిజెపికి పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. బాబుల్ సుప్రియో నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
గత కొంత కాలంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్ లో బిజెపిని దెబ్బకొట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. పలువురు కీలక నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూ చాలా వరకూ విజయవంతం అవుతోంది. అయితే మరి బాబుల్ సుప్రియో విషయంలో బిజెపి అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఏకంగా టీఎంసీ కండువా కప్పుకున్నారు. బాబుల్ సుప్రియో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేక బిజెపి ఆయనపై అనర్హత వేటు వేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.