పెగాసెస్ స్పైవేర్. కొద్ది రోజుల క్రితం దేశంలో సంచలనం రేపిన అంశం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు కొంత మంది జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, కీలక అధికారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నివేదికలు బహిర్గతం అయ్యాయి. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ప్రభుత్వం మాత్రం అంతా నిబంధనల ప్రకారమే అంటూ ప్రకటనలు చేసింది తప్ప..అసలు పెగాసెస్ స్పైవేర్ వాడింది లేనిది కూడా బహిర్గతం చేయలేదు. సుప్రీంకోర్టు ఈ అంశంపై పలుమార్లు అడిగినా కూడా అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలు బహిర్గతం చేయలేమనే సమాధానం ఇచ్చింది. దీనిపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము అలాంటి విషయాలు అడగలేదని..కేవలం స్పైవేర్ వినియోగానికి సంబంధించిన అంశంపై మాత్రమే సమాధానం కోరుతున్నామని పేర్కొంది.
కేంద్రం ఏ మాత్రం దిగిరాకపోవటంతో ఇక సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగింది. పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.