రజని స్టైల్ మూవీ...జైలర్

Update: 2023-08-10 11:13 GMT

Full Viewరజనీకాంత్ అంటే స్టైల్. స్టైల్ అంటే రజనీకాంత్. దేశంలోని కోట్లాది మంది సినీ అభిమానుల్లో రజనీకాంత్ స్టైల్ కోసమే సినిమా చూసే వారు ఉంటారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. గత కొంత కాలంగా రజనీకాంత్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాలను దక్కించుకోలేకపోతున్నాయి. గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన జైలర్ సినిమాతో రజనీకాంత్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారనే చెప్పొచ్చు. సింపుల్ కథనే రజనీకాంత్ స్టైల్ కు అనుగుణంగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించడంలో చాలా వరకు విజయవంతం అయ్యారు. ఇక సినిమా కథ విషయాన్ని వస్తే ముత్తువేల్ (రజనీ) తన కుటుంబంతో - భార్య (రమ్యకృష్ణ), కొడుకు (వసంత్ రవి), కోడలు (మిర్నా మీనన్) మనవడితో కలిసి రిటైర్ద్ జైలర్ గా జీవితం సాగిస్తుంటాడు. అతిపురాతమైన, ఎంతో విలువైన దేవుడి విగ్రహాలను కాజేసి విదేశాలకు అమ్ముకునే వర్ణ (వినాయకన్) ముఠా నాయకుడ్ని పట్టుకునేందుకు జైలర్ కొడుకు ఏసిపి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ముఠా వెనక పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారు ఇందులో లోతుగా వెళ్లొద్దు అని తన సిబ్బంది చెప్పిన కూడా ఏసిపీ వాళ్ళను పట్టుకునే క్రమంలో మిస్ అయి పోతాడు. పోలీస్ అధికారి కనిపించకుండా పోయారు అనే వార్త బయటకు వస్తే ఇబ్బంది అని...ఉన్నతాధికారులు ఇప్పటికిప్పుడు ఈ విషయం బయటకు రాకుండా చూడాలని రజనీకాంత్ ను కోరతారు. తర్వాత రజని రంగంలోకి దిగి ఈ కేసు గురించి ఫోకస్ పెట్టడటం...ఈ క్రమంలో కుటుంబానికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? మిస్ అయిన కొడుకు దొరికాడా లేదా అన్నదే జైలర్ సినిమా.

                                        పాత్రల పరంగా చెప్పుకోవాల్సి వస్తే రజనీ నట విశ్వరూపం చూపించారు ఇందులో. నరసింహ, రోబో సినిమాల తరువాత ఈ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అతిగా పోకుండా ఆయన వయసుకు తగ్గ పాత్ర చేసి అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. కధలో హీరోకు అవసరమైన సమయంలో సహాయం చేసే పాత్రలను కూడా కధకు అనుగుణంగా పరిచయం చేసిన విధానం బాగుంది. వారిలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , హిందీ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ మెరిశారు. తమన్నా ఒక పాటలో తన డాన్స్ తో అదరగొట్టింది అనే చెప్పాలి. ఇందులో ముఖ్యంగా హీరో రజనీకాంత్, యోగి బాబు ల మధ్య డైలాగులు ఆకట్టుకుంటాయి. దీంతో పాటు సునీల్, తమన్నా ల రహస్య ప్రేమ వ్యవహారం కూడా ఆకట్టుకుంటుంది. మానసిక రోగిగా రజనీకాంత్ హాస్పిటల్ కు వెళ్లినప్పుడు సాగే సంభాషణలు సరదాగా ఉంటాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై టెక్నికల్ గా ఈ సినిమాను చాలా స్టైలిష్ గా, రిచ్ గా కమర్షియల్ హంగులతో తీశారు. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. జైలర్ సినిమా ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కొంత స్లో అయినా కూడా జోష్ తగ్గకుండా చేశారనే చెప్పాలి. రజనీకాంత్ తన ఫ్యామిలీ ని అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చో బెట్టిన సమయంలో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో చూపించే జైలర్ గా కంటే రజని కాంత్ కు రిటైర్డ్ ఆఫీసర్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రజని అభిమానులకు ఇది బ్లాక్ బస్టర్..ప్రేక్షకుల పరంగా చూస్తే హిట్ మూవీగా జైలర్ నిలుస్తుంది.

రేటింగ్ :3 /5

Tags:    

Similar News