మెగా స్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచార్య సినిమా భారీ ఝలక్ ఇచ్చింది. ఈ ఝలక్ తర్వాత వచ్చిన సినిమానే 'గాడ్ ఫాదర్'. అది కూడా మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసి ఉన్నారు. గత కొన్ని రోజులుగా గాడ్ పాదర్ సినిమాపై హైప్ పెంచేందుకు చిరంజీవి వరసగా పొలిటికల్ డైలాగ్ లు ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ హీట్ పెంచారు. విజయదశమితో మరో విజయాన్ని అందుకుని ముందుకు సాగాలని చిరంజీవి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నం పూర్తి స్థాయి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పలేం. లూసిఫర్ సినిమా చూడని వారికి మాత్రం ఇది ఓకే సినిమా. దర్శకుడు మోహన్ రాజా ఎక్కువగా చిరంజీవికి భారీ ఎలివేషన్స్ ఇచ్చి సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీనికి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకూ పనిచేసిందని చెప్పొచ్చు. అయితే సినిమా కథ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు కథలో ఎక్కడా కొత్తదనం ఏమీ కన్పించదు. సినిమా అంతా కూడా సీఎం పదవి దక్కించుకునేందుకు జరిగే రాజకీయ పోరాటమే. ఈ పదవి దక్కించుకునేందుకు సత్యదేవ్ ప్రయత్నం చేస్తుంటే..దీన్ని అడ్డుకునేందుకు చిరంజీవి వేసే ఎత్తులే గాడ్ పాదర్ మూవీ. సత్యదేవ్ తన మామను చంపి..డబ్బు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా సీఎం రేసులో ముందు వరసలో ఉంటాడు. కానీ ఎక్కడికి అక్కడ చిరంజీవి దీనికి బ్రేకులు వేస్తూ వస్తారు. మామను హత్య చేసి అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న సత్యదేవ్ కు ఆయన భార్య నయనతార మద్దతు ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్న చిరంజీవిపై ఆమెకు ఎక్కడ లేని ద్వేషం ఉంటుంది.
కనీసం తన తండ్రి చనిపోయిన సమయంలో కూడా చిరంజీవి అక్కడకు రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అసలు చిరంజీవికి, నయనతార మధ్య అంత ద్వేషం ఉండటానికి కారణం ఏమిటి.. గాడ్ ఫాదర్ టైటిల్ కు చిరంజీవి ఎలా జస్టిఫికేషన్ ఇచ్చారు అన్నది వెండితెరపై చూడాల్సిందే. ప్రపంచ అండర్ వరల్డ్ కు బాస్ గా ఉన్న (చిరంజీవి) ఓ చోట అనాథ ఆశ్రమం నడుపుతూ ఉండటం వంటి స్టోరీలు రజనీకాంత్ బాషా కాలం నుంచి చూస్తున్నదే. అలాగే చిరంజీవి, నయనతారల మధ్య ద్వేషం పెరగటానికి కారణం కూడా ఇప్పటికే చూసీచూసీ విసుగుపుట్టిన లైనే. అయితే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సత్యదేవ్ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. గాడ్ పాదర్ లో హైలెట్ అంటే సత్యదేవ్ పాత్రే. సల్మాన్ ఖాన్ పాత్ర గురించి నిజంగా పెద్దగా చెప్పుకోవటానికి ఏమీలేదు. చిరంజీవి అభిమానులకు అయితే గాడ్ పాదర్ ఓ పండగే..సినీ అభిమానులకు అయితే ఇది ఓ రొటీన్ సినిమానే. సత్యదేవ్ నటన..తమన్ మ్యూజిక్..హీరో ఎలివేషన్లు గాడ్ పాదర్ ను నిలబెట్టాయని చెప్పొచ్చు.
రేటింగ్. 2.5\5