టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితి. అంతా పైకి బాగానే ఉన్నట్లు కన్పిస్తున్నా ఒకరి వెనక ఒకరు గోతులు తీసుకుంటారు. అంతే కాదు.. స్నేహితుడికి ఓ మంచి సూపర్ హిట్ వచ్చినా తట్టుకోలేరు. అది మరీ కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన వారికి బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తే అప్పటికే టాప్ హీరోలుగా ఉన్న వారి బాధ వర్ణనానీతం. ఇది అంతా బయటకూ పెద్దగా కన్పించదు కానీ..లోపల లోపల మాత్రం మంట మండుతూనే ఉంటుంది. ఛాన్స్ ఉంటే ఆ న్యూ ఎంట్రీలను ఎక్కడికి అక్కడ తొక్కేసి తమ స్థానాలను సుస్ధిరం చేసుకుందామని చూసుకుంటారు. కొంత మంది ఈ తొక్కుడును కూడా తట్టుకుని నిలబడగలుగుతారు. దీనికి చాలా గట్స్ కావాలి. కాలం కలసి రావాలి కూడా. మొత్తానికి యువ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నా తాత ఎవరో తెలియదు..అయ్య ఎవరో తెలియదు..నా సినిమా ట్రైలర్ కు ఇంత రచ్చ ఏందిరా అయ్యా అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ లో ఉన్నది అంతా అంటే ఏకంగా 80 శాతం వరకూ సినీ వారసత్వం ఉన్నవారే అన్న విషయం తెలిసిందే. అయితే విజయదేవరకొండ ఈ వ్యాఖ్యలు అన్యాపదేశంగా ఉన్నారా లేక ఎవరినైనా టార్గెట్ చేసుకుని అన్నారా అన్న విషయం ఎవరికీ తెలియదు. అయినా అవి చాలా మందికి మంటగా మారాయి. కొంత మంది హీరోల ఫ్యాన్స్ అయితే విజయ్ దేవరకొండ ట్రోలింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చారు. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్' అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది కొత్త చర్చకు దారితీసింది. అసలు విజయ్ దేవరకొండ ఎవరిని ఉద్దేశించి ఏ మాటలు అన్నారో తెలియదు కానీ..బండ్ల గణేష్ ప్రముఖ హీరోలందరినీ ఇందులోకి లాగినట్లు అయింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే లైగర్ సినిమా ట్రైలర్ ను చిరంజీవి, ప్రభాస్ లే సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మరి ఇప్పుడు బండ్ల ట్వీట్ కు ఎలాంటి స్పందనలు వస్తాయో వేచిచూడాల్సిందే.