నేషనల్ క్రష్ రష్మిక మందన్న..టాలీవుడ్ రౌడీ హీరోగా పేరున్న విజయదేవరకొండ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ అధికారికంగా అంగీకరించకపోయినా...ఇద్దరూ కలిసి పలు మార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళటం..ముంబై వంటి చోట పలు మార్లు ఇద్దరూ కలిసి డిన్నర్లకు వెళ్లిన ఫోటో లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు విజయదేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ రష్మిక కూడా తాను ఈ ఫ్యామిలీలో భాగం అనే సంకేతాలు ఇచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా శుక్రవారం నాడు వీళ్లిద్దరి నిశ్చితార్ధం విజయదేవరకొండ నివాసంలో జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని..వీళ్లిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఉండే అవకాశం ఉంది చెపుతున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయంలో అటు విజయదేవరకొండ..ఇటు రష్మిక లు మాత్రం ఎక్కడా అధికారికంగా స్పందించలేదు.
రష్మిక, విజయదేవరకొండ లు జంటగా నటించిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఇదే జంట డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ కూడా రాబోతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ లో వీళ్లిద్దరు కలిసి నటించనున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. దీనిపై కూడా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. రష్మిక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. విజయ్ హీరోగా నటించిన కింగ్డమ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు మాత్రమే రాబట్టగలిగింది. వీళ్లిద్దరి పెళ్లి విషయాన్ని విజయదేవరకొండ టీం ధ్రువీకరించింది.