వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడింది. వాస్తవానికి ఫస్ట్ ఈ సినిమా ను అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత విడుదల తేదీని అక్టోబర్ 9 కి మార్చారు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. హీరో, హీరోయిన్స్ అంతా ఇంటర్వ్యూ లు కూడా మొదలుపెట్టారు. కానీ సడన్ గా విడుదల కు ఇంకా కేవలం మూడు రోజులు మిగిలి ఉన్న సమయంలో సోమవారం నాడు మళ్ళీ ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అని అధికారికంగా ప్రకటించారు. వెంకటేష్ ఫ్యాన్స్ కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. దసరా సెలవుల ముందు విడుదల అవుతుండటం...ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసిపెట్టాయి. కానీ చివరి నిమిషంలో మరో సారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటం వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు.
ఏ సినిమా విషయంలో అయినా సహజంగా అన్నీ చూసుకునే విడుదల తేదీ ఖరారు చేసుకుంటారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ అయిపోయి ఇంటర్వూస్ కూడా మొదలుపెట్టి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది అని చెప్పటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఆమె తో పాటు నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆదర్శ కుటుంబం సినిమా విడుదల వాయిదా పడటం శ్రీ విష్ణు మూవీ కామ్రేడ్ కళ్యాణ్ కు ఎంతో మేలు చేసినట్లే అని చెప్పొచ్చు.