హీరో నాని నిర్మాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లే ఓటీటీలో సినిమా విడుదల చేయటంతోపాటు..సెప్టెంబర్ 10నే 'టక్ జగదీష్' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అదే రోజు థియేటర్లలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ అంశంపైనే ఎగ్జిబిటర్లు మీడియా సమావేశం పెట్టి మరీ నానిపై విమర్శలు గుప్పించారు. కనీసం లవ్ స్టోరీ థియేటర్లలో సినిమా విడుదల అవుతున్న సమయంలో కాకుండా విడుదల తేదీ అయినా మార్చుకోవాలని సూచించారు.
అయితే టక్ జగదీష్ చిత్ర యూనిట్ శుక్రవారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'భూదేవిపురం చిన్నకొడుకు..నాయుడుగారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు. మొదలెట్టండి' అంటూ హీరో నాని చెప్పే డైలాగ్ తో ఓ వీడియోను విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూవర్మ నటించింది. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేష్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఇప్పుడు లవ్ స్టోరీ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.