కేజీఎఫ్ సినిమాలకు ముందు హీరో యష్ ఎవరో పెద్దగా సినీ ప్రపంచానికి తెలియదు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ వన్...కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో ఒక్కసారిగా ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ రెండు సినిమాలతోనే ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇంత ఇమేజ్ సంపాదించుకున్న హీరో నెక్స్ట్ సినిమా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సెలెక్ట్ చేసుకుంటాడు అనుకుంటారు ఎవరైనా. కానీ టాక్సిక్ సినిమా చూసిన తర్వాత మాత్రం యష్ అసలు ఈ సినిమాను ఎలా..ఎందుకు ఒప్పుకున్నాడు అన్న అభిప్రాయం కలగకమానదు. ఎందుకంటే టాక్సిక్ సినిమాలో అసలు కథ లేదు...ఏమీ లేదు. టాక్సిక్ సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే బుల్లెట్ల వర్షం...మందు వర్షం...హీరోయిన్ల వర్షం. అసలు వీళ్ళు అందరూ ఎందుకు వస్తారో...ఎందుకు పోతారో ఎవరికీ తెలియదు.

                                                హీరో యష్ అసలు గీతూ మోహన్ దాస్ కు ఎందుకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడో అన్న ఫీలింగ్ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరికి కలుగుతుంది. అసలు కథే లేని ఈ టాక్సిక్ సినిమాను మళ్ళీ ఏకంగా మూడు గంటల పద్నాలుగు నిమిషాలు సాగదీయటం మరో వింత. ఈ సినిమాలో కాస్తో కూస్తో హీరో యష్ తర్వాత కాస్త మంచి పాత్ర దక్కింది అంటే నయనతార కే ని చెప్పాలి. కియారా అద్వానీ పాత్రకు ఎమోషన్స్ జోడించినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇతర హీరోయిన్లు రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి పాత్రలు రొటీన్ గానే ఉంటాయి. ఈ సినిమాలో హీరో యష్ అక్కగా నయనతార కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన డ్రగ్స్ సరఫరా...కీలక ప్రాంతాలను తమ గుప్పిట పెట్టుకోవాలనే గ్యాంగ్ ల మధ్య పోరాటమే ఈ సినిమా అయినప్పటికీ అంతా గందరగోళంగానే ఉంటుంది తప్ప ఎక్కడా స్పష్టత కానరాదు.

                                మూడు గంటలకుపైగా ఉన్న ఈ సినిమాలో కేవలం నాలుగైదు చోట్ల సంభాషణలు మాత్రమే ఒకింత ఆకట్టుకుంటాయి. మిగిలిన సినిమా అంతా బోరింగ్ గానే సాగుతుంది. నిర్మాణం విషయంలో భారీ హంగులు ఉన్నా కూడా ఈ సినిమాలో కథ, కథనం ఏ మాత్రం అసక్తికరంగా లేకపోవటంతో ప్రేక్షకులు భారంగా కాలం గడపాల్సి వస్తుంది. మొత్తం మీద మంచి విజయాలతో ఉన్న హీరో యష్ కు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాత్రం దారుణమైన సినిమాను ఇచ్చింది అనే చెప్పాలి. ఈ మూవీ ట్రైలర్ తో పాటు అంతకు ముందు వీడియోల్లో చూపించినట్లు ఈ సినిమాలో మితిమీరిన హింస, శృంగార సన్నివేశాల డోస్ చాలా ఎక్కువగానే ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ సో సో గా ఉంటే...సెకండ్ మరింత బోరింగ్ గా ఉంటుంది.

                                                                                                                              Full View రేటింగ్ : 2 /5

Tags: