మరో సారి ఫ్యాన్స్ వార్ తప్పదా!

Update: 2025-07-12 15:13 GMT

టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో భారీ ఫైట్ కు రంగం సిద్ధం అయింది. సహజంగా సంక్రాంతి సమయంలో పెద్ద హీరో ల సినిమాలతో పాటు మిడ్ రేంజ్..చిన్న హీరో ల సినిమా లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. 2025 దసరా కు కూడా అలాంటి వాతావరణమే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి దసరా కు బాక్స్ ఆఫీస్ వద్ద సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా ఢీకొట్టబోతోంది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి ల సినిమా అఖండ 2 తాండవం సినిమా ను సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్లు కొద్ది నెలల క్రితమే ప్రకటించారు. ఇటీవల విడుదల అయిన అఖండ 2 టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి.

                                   దసరా అక్టోబర్ 2 కావటంతో ఈ పండగ సెలవులను టార్గెట్ గా చేసుకునే ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ఈ సినిమా ను కూడా సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జులై 24 న పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే అంటే సెప్టెంబర్ లో మళ్ళీ ఓజీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బిజినెస్ పరంగా కూడా ఓజీ కి మంచి డిమాండ్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ మూవీ ని భారీ చిత్రాల నిర్మాత డీవివి దానయ్య నిర్మించారు. సో దసరాకు ఇద్దరు కీలక హీరో ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొట్టనుండటంతో మరో సారి టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది.

                         ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఈ రెండు సినిమా ల విషయంలో ఎవరూ కూడా వెనక్కి తగ్గే అవకాశం కనిపించటం లేదు అని చెపుతున్నారు. కొన్నిసార్లు పోటీ అనివార్యం అయినా కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ కోసం ఒక రోజు అయినా గ్యాప్ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అఖండ 2 తాండవం, ఓజీ విషయంలో అలాంటిది ఏమీ జరగటం లేదు. రెండు సినిమా లు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో దసరా కు బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు రికార్డు లతో బాక్స్ లు బద్దలు కొడతారో చూడాలి. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో వైపు బాలకృష్ణ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమా లు చేస్తూ వెళుతున్నారు.

Tags:    

Similar News