సినిమా...రాజకీయం. టాలీవుడ్ కు చెందిన కీలక నిర్మాతలు అందరూ శుక్రవారం నాడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. నిర్మాతలు తన దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటేనే తాను రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంశాన్ని ఆన్ లైన్ టిక్కెట్ల అంశాన్ని ప్రస్తావించినట్లు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. మరి ఇదే విషయం బయట చెప్పమంటే నిర్మాతలకు భయం అన్నారు. తన సినిమాలు అన్నది పెద్ద సమస్యేకాదని..అందరూ తన దగ్గర చెప్పిన మాటలే తాను చెప్పినట్లు వ్యాఖ్యానించారు. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం కావాలని ఏపీ ప్రభుత్వాన్ని తామే కోరామన్నారు. తమ డిమాండ్లకు..పవన్ రాజకీయ వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు. తర్వాత పరిశ్రమకు చెందిన పలు అసోసియేషన్లు పవన్ వ్యాఖ్యలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయకపోగా..వాటితో తమకు సంబంధం లేదని ప్రకటనలు ఇచ్చాయి.
మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ సర్కారు..టాలీవుడ్ మధ్య పెద్ద దుమారమే రేపింది. తాము పరిశ్రమకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని..పవన్ తో ఎవరూ లేరనే చెప్పే ప్రయత్నం చేశారు ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు. ఈ తరుణంలో కీలక నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయన్నారు. అయితే వీరు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందించారన్నది తేలియాల్సి ఉంది.