తొలి దెబ్బ దిల్ రాజుకే!

Update: 2024-12-23 07:07 GMT

సంక్రాంతి పండగకు సినిమాల పండగ కూడా కామనే. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ లో తక్కువలో మూడు, నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ సారి కూడా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమా లు అయితే ఇప్పటికి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ప్రతి సారి సంక్రాంతి సినిమాల బరిలో నిలవటానికి ఆసక్తి చూపే బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ ఒకటి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. దీంతో పాటు రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ ఒకటి. మూడవ సినిమా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. విచిత్రం ఏమిటి అంటే ఈ రెండు సినిమాల నిర్మాత కూడా దిల్ రాజే. టికెట్ ధరలతో పాటు టాలీవుడ్ లో విడుదల అయ్యే సినిమాలకు థియేటర్ల విషయంలో కూడా దిల్ రాజు కీలక పాత్ర పోషిస్తారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

                                         ముఖ్యంగా ఒకే సారి పలు సినిమాలు విడుదల విషయంలో పోటీ పడుతున్న సమయంలో దిల్ రాజు తన వంతు పాత్ర పోషిస్తారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 5 న విడుదల అయిన అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 బెనిఫిట్ షో లతో పాటు టికెట్ రేట్లు పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సంధ్య థియేటర్ లో చోటుచేసుకున్న విషాద ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షో లతో పాటు టికెట్ రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పింది.

                                స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తొలి దెబ్బ పడేది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు పైనే కావటం విశేషం. ఎందుకనే ఆయన రెండు సినిమాలు జనవరిలో విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌ విషయంలో దిల్ రాజు భారీ ఆశలే పెట్టుకున్నారు. కారణాలు ఏంటో తెలియదు కానీ...గేమ్ ఛేంజర్‌ సినిమాకు అంతా బజ్ క్రియేట్ కావటం లేదు అనే చర్చ టాలీవుడ్ లో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏమైనా ఇందులో మార్పు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఒక వైపు సినిమా కు బజ్ లేక...మరో వైపు టికెట్ రేట్స్ పెంపు లేకపోతే మాత్రమే ఈ ప్రభావం గేమ్ ఛేంజర్‌ పై భారీగానే పడే అవకాశం ఉంది అనే చర్చ టాలీవుడ్ లో సాగుతోంది. తెలంగాణ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. మారిన పరిస్థితుల్లో దిల్ రాజు తో పాటు టాలీవుడ్ మొత్తం తమ గేమ్ ను మార్చుకోక తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News