
టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కొనసాగుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు బుధవారం నాడు దగ్గుబాటి రానా హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో రానా పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. 2017 జరిపిన ఎక్సైజ్ విచారణలో రానా,రకుల్‌ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి తాజాగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ఈడీ ముందుకు హాజరు అయిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రానాను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
విదేశీ టూర్లు,మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.అంతేకాకుండా ఎఫ్ క్లబ్ వ్యవహారాల్లో నవదీప్,రకుల్‌తో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట తీసుకొచ్చారు. ఆడిటర్స్, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత తెలంగాణ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు విచారణలో కేంద్ర ఏజెన్సీలకు సహకరించలేదు. చివరకు ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరింది. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వటంతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.