నందమూరి బాలకృష్ణ కు తన సినిమాలతో సంక్రాంతి రేస్ లో నిలవటం ఎంతో సరదా. గతంలో అయన నటించిన మొత్తం 13 సినిమాలు సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు అంటే 2023 లో వీర సింహారెడ్డి, 2025 లో డాకు మహారాజ్ విడుదల అయిన విషయం తెలిసిందే. డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అఖండ 2 తాండవం సినిమా ఎవరూ ఊహించని రీతిలో వాయిదా పడింది. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవటంతో ఇప్పుడు ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు అన్న చర్చ సాగుతోంది. సోషల్ మీడియా లో దీనికి సంబంధించి రకరకాల తేదీలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ తరుణంలో బుక్ మై షో లో కనిపించిన అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి.
అదేంటి అంటే అఖండ 2 సినిమా విడుదల 2026 లో అని బుక్ మై షో చూపిస్తోంది. దీంతో బాలకృష్ణ కు ఎంతో ఇష్టమైన సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా కూడా బరిలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొని ఉంది. ఈ తరుణంలో బాలకృష్ణ అఖండ 2 కూడా సంక్రాంతి బరిలోకి వస్తే ఈ పోటీ మరింత పీక్ కు చేరుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ జనవరి 9 డేట్ ను లాక్ చేసుకుంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా సంక్రాంతికి రానుంది. మరో వైపు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగ ఒక రాజు మూవీ తో పాటు రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కూడా సంక్రాంతి రేస్ లోనే ఉంది. ఈ లెక్కన చూసుకున్నా కూడా ఇప్పటికే టాలీవుడ్ నుంచి నాలుగు సినిమా లు రేస్ లో ఉన్నాయి.
ఇప్పుడు బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం కూడా జాయిన్ అయితే ఈ పోటీ మరింత తీవ్రం అవటంతో పాటు థియేటర్ల సమస్య కూడా తలెత్తడం సహజం. మరో వైపు అఖండ 2 నిర్మాత త్వరలోనే బ్లాక్ బస్టర్ తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించారు. దీంతో బుక్ మై షో చెప్పినట్లు ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి వస్తుందా అనే చర్చ సాగుతోంది. చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే వరకు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, ఎరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల సమస్య కారణంగా చివరి నిమిషంలో అఖండ 2 విడుదలకు బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.