పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా తెలంగాణ హై కోర్ట్ ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. తెలంగాణాలో పెంచిన టికెట్ ధరలకు బ్రేకులు వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మెమో పై స్టే ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రమంతటా స్పెషల్ షో లకు సంబంధించి ఒక్కో టికెట్ ను సినిమా అభిమానులు 800 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో ఏ ఒక్క థియేటర్ లో కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు అంటే అది ఏ మాత్రం అతిశయోక్తికాదు. ఈ తరుణంలో తెలంగాణ హై కోర్ట్ ఆదేశాలు ఓజీ మూవీ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇటు తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వటంతో పాటు ఈ సినిమా కు రేట్లు పెంచుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ హై కోర్ట్ టికెట్ రేట్లు పెంపు మెమో ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు జస్టిస్ ఎన్ వీ శ్రవణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇది ఖచ్చితంగా ఈ మూవీ కలెక్షన్స్ పై ప్రాభవం చూపించే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు అయితే స్పెషల్ షోస్ తో పాటు హైదరాబాద్ లో ఫస్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి. మహేష్ యాదవ్ అనే వ్యక్తి టికెట్ రేట్ల పెంపు విషయాన్నీ కోర్ట్ లో సవాల్ చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో హోమ్ శాఖ స్పెషల్ సిఎస్ కు ఎలాంటి అధికారాలు లేవు అని ...హైదరాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్, జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారంలో ఉంది అని పిటిషినర్ తరపు లాయర్ కోర్ట్ ని నివేదించారు. దీంతో కోర్ట్ టికెట్ పెంపు ఆదేశాలకు బ్రేక్ వేస్తూ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేసింది.