దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
మేం కోట్లు పెట్టి చిల్లర ఏరుకుంటున్నాం..మరి మీరు?
తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
సినిమా రంగానికి చెందిన వారిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన బలుపు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై సినీ రంగానికి చెందిన వారు వరసపెట్టి స్పందిస్తున్నారు. దర్శకుడు వి ఎన్ ఆదిత్య సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేయగా..నిర్మాత ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. మరో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మీడియా ముందుకు వచ్చారు. తమ్మారెడ్డి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి బలిసిందో తెలియాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు.
'సినిమా వాళ్లంటే చీప్‌గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్?.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు?.. మీ చరిత్రలేంటి?.. వాటి గురించి మాట్లాడదామా?.. ఓపెన్ డిబేట్‌కు వస్తారా ఎవరైనా?.. దమ్ముందా?.. ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు?
మీరంతా రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత... వచ్చాక ఎంత?.. మీ పార్టీలోని చోటా మోటా నాయకుల ఆస్తులు తీయండి.. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా?.. దమ్ముంటే రండి.. ఓపెన్ ఛాలెంజ్. మేము కష్టపడి సంపాదిస్తున్నాం. సినిమాను తయారు చేస్తున్నాం. మా కళలను అమ్ముతున్నాం. ఒక సినిమాకు 200 మందిపైనే కష్టపడతారు. మేము కోట్లు కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం. అంతేకానీ మీలా ఒక రూపాయ పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా.'' అని తమ్మారెడ్డి భరద్వాజా హెచ్చరించారు.