బిగ్ బాస్ హౌస్ లో సయ్యద్ సోహైల్ ది ఓ ప్రత్యేక కథ. మాట్లాడితే కథ వేరే ఉంటది అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ ముగింపు రోజున కూడా అదే ప్రత్యేకత చాటుకున్నాడు. ఫైనలిస్టులు ఐదుగురులో ముందు హారిక ఎలిమినేట్ అయింది. తర్వాత అరియానా వంతు వచ్చింది. ముందు నాగార్జున పది లక్షల రూపాయలు ఓ సూట్ కేసులో పెట్టి ఎవరైనా సరే అవి తీసుకుని స్టేజీ మీదకు రావొచ్చని ఆఫర్ ఇస్తాడు. కానీ ఐదుగురిలో ఎవరూ అందుకు సిద్ధపడరు. కానీ ముగ్గురు మిగిలి ఉండగా..ముందు 20 లక్షల రూపాయలతో సేమ్ ఆఫర్ ఇస్తాడు నాగార్జున. ఎవరైనా సరే తీసుకోవచ్చంటూ అంటూ టెంప్ట్ చేస్తారు. కానీ ఎవరూ మొగ్గుచూపరు అందుకు. కానీ నాగార్జున ఈ ఆఫర్ ను 25 లక్షలకు పెంచుతారు. వెంటనే సోహైల్ ఆ మొత్తం తీసుకోవటానికి రెడీ అయిపోతారు. అంతా అయిపోయాక నువ్వే విన్నర్ అయి 50 లక్షలు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది కదా అంటూ నాగార్జున కాసేపు ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేస్తారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న సోహైల్ 25 లక్షల రూపాయలు తీసుకుని బయటకు వస్తాడు. అయితే అందులో పది లక్షల రూపాయలను అనాథ ఆశ్రమానికి ఇవ్వాలని సోహైల్ తమ్ముడు షరతు పెడతాడు.
దీనికి సోహైల్ కూడా ఓకే చెబుతాడు. అయితే వేదిక మీదకు వచ్చిన తర్వాత సోహైల్ ఐదు లక్షల రూపాయలు అనాథ ఆశ్రమానికి మరో ఐదు లక్షల రూపాయలు తన మిత్రుడు మెహబూబ్ ఇళ్ళు కట్టుకోవటానికి సాయం చేస్తానని ప్రకటిస్తాడు. అయితే మెహబూబ్ దాన్ని తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షల రూపాయలు కూడా అనాథ ఆశ్రమానికే ఇవ్వాలని కోరతాడు. దీంతో నాగార్జున స్పందించి అనాథ ఆశ్రమానికి తానే పది లక్షల రూపాయలు ఇస్తానని..25 లక్షల రూపాయలు ఇంటికే తీసుకెళ్ళాలని సోహైల్ కు సూచిస్తాడు నాగార్జున. దీంతో మెహబూబ్, సోహైల్ లు వేదిక మీద నాగార్జునకు పాదాభివందనం చేస్తారు. అందరూ సోహైల్ నిర్ణయాన్ని స్వాగతించారు.