ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను కొమురం భీమ్ గా పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఓ వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దర్శకుడు రాజమౌళిపై గరం గరంగా ఉన్నారు. దీనికి కారణం కాపీ సీన్లు ఒక కారణం అయితే..జనతాగ్యారేజ్ సినిమాలో ఉన్న తరహాలో ఎన్టీఆర్ కు టోపీ పెట్టడం మరింత దుమారం రేపింది. తాజాగా ఆదిలాబాద్ కు చెందిన బిజెపి ఎంపీ సోయం బాబూరావు దర్శకుడు రాజమౌళికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర తెలియకుండా ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు అన్నారు. ఆర్ఆర్ ఆర్ సినిమాలో భీం పాత్రకు పెట్టిన టోపీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు.
సినిమా కలెక్షన్‌ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమంటూ ఈయన హెచ్చరించారు. నిజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని సోయం పేర్కొన్నాడు. భీంను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని.. లేదంటే మంచిగా ఉండదన్నారు. ఇప్పటికే పలువురు గోండు నేతలు కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి దీనిపై వివాదం నడుస్తూనే ఉంది.