పాటకు ప్రాణం ఉంటే..ఇప్పుడు వాటి కన్నీటిని ఆపటం ఎవరితరమూ కాదు. ఎందుకంటే వేల పాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. సీతారామశాస్త్రి అసలు ఇంటి పేరు చెంబోలు. అయితే ఆయన అసలు ఇంటిపేరు ఎవరికీ తెలియదు అనటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సిరివెన్నల సినిమాతో ఆయన ప్రేక్షకులు..శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని..ఈ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ రచయితగా పేరుగాంచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో 4.07 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయన లంగ్ క్యాన్సర్ సమస్యలతో..న్యూమోనియాతో కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 24న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయనకు వైద్యులు సేవలు అందించే ప్రయత్నం చేసినా.. ప్రాణాలు కాపాడలేకపోయారు. సిరివెన్నెల సితారామశాస్త్రి ఆయన వయస్సు 66 సంవత్సరాలు. 2020 సంవత్సరం నాటికి ఆయన రాసిన పాటలు 3000 వేలుపైనే. సిరివెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు ఏకంగా 11 వచ్చాయి. దీంతోపాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు నాలుగు ఆయన ఖాతాలో ఉన్నాయి. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం అయింది. టాలీవుడ్ లోని దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయింది. కె. విశ్వనాధ్ చేసిన సినిమాలు అన్నింటికీ ఆయనే పాటలు అందించారు.