పాన్ ఇండియా మూవీని పక్కకు నెట్టి..!

Update: 2025-01-17 12:54 GMT

ఈ సంక్రాంతి సీనియర్ హీరోలదే. పండగకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా అందరి దృష్టి బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలపైనే ఉంది అనే విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ మూవీ అందరి కంటే ముందుగా జనవరి 10 న రిలీజ్ అయినా కూడా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత బాలకృష్ణ సినిమా ...ఆ వెంటనే వెంకటేష్ మూవీలు విడుదల కావటంతో ఫోకస్ అంతా కూడా వీటిపైకి మారిపోయింది. అటు డాకు మహారాజ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పాజిటివ్ రివ్యూ లు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అందరూ ఈ సినిమాలపైనే ఆసక్తి చూపారు. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తే ..మరో కీలక పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటించింది. సరిగ్గా పండగా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది.

                                                          ఈ సినిమా కూడా మూడు రోజుల్లోనే 106 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాయి. అమెరికా లో కూడా ఈ సినిమా వన్ మిలియన్ వసూళ్లను సాధించింది. ఒక్క బుక్ మై షో లోనే సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్స్ 15 లక్ష లు అమ్ముడు పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమాకు అదనంగా రెండు వందలకు పైగా షోస్ యాడ్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మొత్తం మీద ఈ సంక్రాంతి రేస్ లో రామ్ చరణ్ మూవీ వెనకపడగా...సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ మూవీలు మాత్రం దూసుకెళుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో పోలిస్తే గేమ్‌ ఛేంజర్‌ మూవీ బడ్జెట్ ఎక్కువ ..పైగా అది పాన్ ఇండియా మూవీ కూడా.

Tags:    

Similar News