హోంబలే ఫిల్మ్స్ సంచనలన నిర్ణయం

Update: 2023-12-21 13:39 GMT

ఒకే సారి పెద్ద సినిమాలు...పెద్ద హీరోల సినిమాల విడుదల ఉంది అంటే అది ఖచ్చితంగా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇక్కడ థియేటర్ల కేటాయింపు ప్రధాన సమస్యగా మారుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం కొంత మంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సమస్య దేశ వ్యాప్తంగా వచ్చింది. పరిస్థితి ఏకంగా ఇప్పుడు ప్రభాస్ సలార్ వెర్సస్ షారుఖ్ ఖాన్ డుంకి అన్నట్లుగా తయారైంది. డుంకి గురువారం నాడే విడుదల కాగా...సలార్ శుక్రవారం నాడు విడుదల కానుంది. సలార్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను తెరకెక్కించింది కెజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటం కూడా ఒకటి. దీంతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తొలిసారి కావటంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి పెరగటానికి కారణం అయింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పీవిఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ సలార్ కంటే డుంకి కి ఎక్కువ స్క్రీన్ లు కేటాయించాయి. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది.న్యాయమైన పద్దతిలో స్క్రీన్ లు కేటాయించకుండా డుంకి వైపు మొగ్గుచూపటం ఏ మాత్రం సరికాదు అని సలార్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అంటోంది.

                                        Full Viewఅంతే కాదు...వీటి వైఖరికి నిరసనగా పీవిఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ లో తమ సలార్ సినిమా విడుదల ఉండదు అని ప్రకటించింది. ఇది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ..ఏ నిర్మాణ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు అనే చెప్పాలి. కొంత మంది షారుఖ్ ఖాన్ సినిమాకు అనుకూలంగా వ్యవహరిస్తూ సలార్ కు తక్కువ స్క్రీన్ లు కేటాయించటం సరికాదు హోంబలే ఫిల్మ్స్ స్పష్టం చేస్తోంది. వివక్ష చూపించటం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని...ఆ రెండు సంస్ధలు తమ వైఖరి మార్చుకుంటే అప్పుడు తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని చెపుతోంది. అయితే డుంకి చిత్రాన్ని ప్రసారం చేస్తున్న థియేటర్లలో కొన్ని షో లు సలార్ వేయటానికి అంగీకరించటం లేదు చెపుతున్నారు. మరి ఇప్పుడు ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అయితే డుంకి తో పోలిస్తే సలార్ సినిమా కు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. 

Tags:    

Similar News