రావణాసురుడిలోని మంచి లక్షణాలను కూడా తమ సినిమాలో చూపిస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. అంతే కాదు..సీతను రావణుడు ఎత్తుకెళ్ళటం కూడా సరైనదే అన్న తరహాలో వ్యాఖ్యానించిన వ్యవహారం సీరియస్ గా మారింది. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని సైప్ అలీఖాన్ పొగడటం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలపై హిందు సంఘాలతో పాటు బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నాయకుడు రామ్‌కదం.. సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలు తనను షాక్‌కు గురి చేశాయంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రావణాసురుడిని మంచివాడుగా చూపిస్తే అస్సలు ఊరుకోమని హెచ్చరించాడు. ఈ పరిణామాలపై స్పందించిన సైఫ్ అలీఖాన్.. ఇతరుల మనోభావలను దెబ్బతీసే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. 'నేను ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించమని కోరుతున్నా. నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను. రాముడు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది.
వీరత్వానికి, ధర్మానికి గుర్తుగా రాముడిని భావిస్తా. కథను వక్రీకరించకుండా చెడుపై మంచి సాధించిన విజయాన్ని 'ఆదిపురుష్'లో చూపించనున్నారు' అని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రభాస్ రాముడి నటించనున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ను రావణాసురుడి పాత్రకు ఎంపిక చేశారు. ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. అసలు రాముడితో రావణుడు యుద్ధం ఎందుకు చేశాడు? అది ఒప్పే అనే కోణంలో సినిమా ఉంటుందని చెప్పాడు. అలాగే రావణాసురుడిలోని మానవత్వా కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నామన్నారు. ఇదే వివాదానికి కారణమైంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.