వాణిజ్యపరంగా రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. బాహుబలి రెండు భాగాలతో ఇది కొత్త హైట్స్ కు చేరింది. ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఇక అబిమానుల హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించి ఇక పలు కొత్త విషయాలు వెల్లడిస్తూ పోతామన్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన గురువారం నాడు హైదరాబాద్ లో మీడియా కోసం ప్రత్యేకంగా 'జననీ' పాటను ప్రదర్శించి చూపించారు. ఇది సినిమాకు ఆత్మలాంటిది అన్నారు. ఈ పాటను అధికారికంగా శుక్రవారం నాడు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళిమాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ తొలి వారంలో ఉంటుందని వెల్లడించారు. ట్రైలర్ విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇలా వరస పెట్టి ప్రమోషన్స్ ఉంటాయన్నారు. త్వరలో జరిగే మీడియా సమావేశంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు. ఈ సమావేశం కేవలం జనని పాట గురించి వెల్లడించటానికే అని తెలిపారు. జనని పాట కోసం కీరవాణి రెండు నెలల పాటు కష్టపడ్డారని తెలిపారు. ఈ పాటకు లిరిక్స్ కూడా కీరవాణే రాసినట్లు వెల్లడించారు. సినిమా ప్రమోషన్లలో నటీ,నటులతోపాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొంటారని తెలిపారు. గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సమావేశంలో రాజమౌళితో పాటు నిర్మాత దానయ్య కూడా పాల్గొన్నారు.