మరి కొద్ది గంటల్లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలతో పాటు గుళ్ళూ..గోపురాలు కూడా తిరిగొచ్చారు. ఇప్పుడు ఈ సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్) ఢిల్లీ ప్రాంతంలో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా 2100 రూపాయలు. అది కూడా పన్నులు లేకుండా. ప్రముఖ బుకింగ్ యాప్ బుక్ మై షోలోనే అధికారికంగా ఈ రేట్లు చూపిస్తున్నాయి. అయితే ఇది త్రీడీ ప్లాటినం సుపీరియర్ విభాగంలో అయితే 2100 రూపాయలు, 3డీ ప్లాటినంలో అయితే 1900 రూపాయలుగా ఉంది. మరో ప్రధాన నగరంలో ముంబయ్ లో అయితే 3డీ రిక్లైనర్ సీట్లు అయితే ఒక్కొక్కటి పన్నులు లేకుండా 1720 రూపాయలుగా ఉంది. ముంబయ్ లో 3డీ క్లాసిక్ ల అయితే మాత్రం టిక్కెట్ ధర 770 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో ఒక్కో టిక్కెట్ ధర 1090 రూపాయలుగా ఉంది. రేట్లు ఇంత భారీగా ఉన్నా సరే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్లు అన్నీ హౌస్ పుల్ గా చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో ఎన్నడూలేని రీతిలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రేట్లు పెంచుతూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితులు చూశాం.
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. పలుమార్లు వాయిదాలు పడిన ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరకు రావటంతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో అయితే కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడ ఫ్యాన్స్ పూనకంతో స్క్రీన్స్ చింపుతారో అన్న భయంతో తెరల ముందు ఏకంగా మేకులు కొట్టడంతోపాటు ప్రత్యేక జాలీలు కూడా ఏర్పాటు చేశారు. అంతే కాదు..కొంత మంది అయితే ఇతర ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు తమకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు. విడుదలకు ముందే ఇలా ఎన్నో సంచలనాలు రేపిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత ఎన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. పెరిగిన రేట్లు..భారీ థియేటర్ల సంఖ్య ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమా రాజమౌళి గత సినిమా బాహుబలి రికార్డులను తిరగరాయటం ఖాయంగా బావిస్తున్నారు.
'రైట్'క్ష