ఒక్క సినిమా టిక్కెట్ ధర 451 రూపాయలు. ఆన్ లైన్ లో బుక్ మై షో ద్వారా ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ కొనాలంటే ఎవరైనా ఈ ధర చెల్లించాల్సిందే. తెలంగాణ సర్కారు ఈ సినిమాకు ప్రత్యేక ధరలకు అనుమతించిన విషయం తెలిసిందే. తొలి మూడు రోజుల పాటు ఓ ధర...తర్వాత వారం రోజుల పాటు మరో ధర అనుమతించారు. రాష్ట్రంలోని ఎయిర్ కండిషన్డ్-ఎయిర్ కూల్డ్ థియేటర్లలో మూడు రోజుల పాటు అంటే మార్చి 25 నుంచి 27 వరకూ సినిమా టిక్కెట్ రేట్లను 50 రూపాయల మేర పెంచుకోవటానికి అనుమతించారు.
స్పెషల్ ఐమ్యాక్స్, మల్టీఫ్లెక్స్ ల్లో మాత్రం వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతించారు. ఒకప్పుడు ఐమ్యాక్స్ లో 150 రూపాయలు ఉన్న ధర పెద్ద సినిమాలకు మాత్రం 200 రూపాయలకు చేరేది. పెంచిన ధరలతో ఇది ఏకంగా మూడు వందల వరకూ చేరింది. ఆర్ఆర్ఆర్ ప్రత్యేక బాదుడుతో 300 రూపాయలకు చేరిన ధర ఇప్పుడు ఏకంగా 150 రూపాయలు పెరిగి 451 రూపాయలకు చేరింది. ఒక్క ఐమ్యాక్స్ మాత్రమే కాకుండా నగరంలోని అన్ని మల్టీప్లెక్స్ ల్లో ఇంచుమించు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.