కరోనా తర్వాత విడుదలై సంచలన వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో తొలిసారి ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించటంతో దీనిపై మొదటి నుంచి అంచనాలు ఓ రేంజ్ కు చేరాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయటానికి సిద్ధం అయింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈనెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ కానుంది.
చాలా మంది ఈ సినిమాను ఓటీవీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ పేరుతో సినిమా టిక్కెట్ ధరలను అడ్డగోలుగా పెంచుతుండటం కూడా ఒకింత ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తోంది. ఎందుకంటే కుటుంబంలోని వారంతా ఒకేసారి సినిమా చూడాలంటే అందుకు భారీగా చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. అందుకే ఫ్యాన్స్..ఇతర సినిమా ప్రియులు మాత్రమే థియేటర్లలో సినిమాలు చూస్తుండగా..చాలా మంది ఓటీటీలో వచ్చాక చూసుకుందాములే అని వేచిచూస్తున్నారు.