ఎన్టీఆర్, రామ్ చరణ్ ల అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా తిరిగేస్తున్నారు. ఎలాగైనా ఈ సారి సినిమా విడుదలను పూర్తి చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది. కొద్ది రోజుల క్రితం సినిమా వాయిదా ప్రసక్తే లేదని నిర్మాత దానయ్య చెప్పారు. అంతే కాదు..దర్శకుడు రాజమౌళి కూడా ఇదే విషయం పునరుద్ఘాటించారు అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ కూడా చేశారు. కానీ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి భయంకరంగా ఉండటంతోపాటు ఏపీలో టిక్కెట్ ధరల సమస్య కూడా చిత్ర యూనిట్ ను వెంటాడుతోంది. దీన్ని ఎలాగోలా సర్దుకోవచ్చని..భావిస్తున్న సమయంలో పలు రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా బ్యాన్ చేయగా..మరికొన్ని 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇవ్వటం చిత్ర యూనిట్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ ను మెజారిటీ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల అంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సినిమా వాయిదా పడటం ఇది నాలుగోసారి.వాస్తవానికి పవన్ కళ్యాణ్, రానాలు కలసి నటించిన బీమ్లానాయక్ సినిమాను బవలంతంగా వాయిదా వేయించి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లకు లైన్ క్లియర్ చేసుకున్నాయి.
అయినా వీళ్ళను సమస్యలు వీడలేదు. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు మళ్లీ సమస్యలు ఎదురయ్యాయి. అంతా అనుకూలిస్తే ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావొచ్చని చెబుతున్నారు. అయితే మరోసారి ఈ సినిమాకు ఇప్పటికే షెడ్యూల్స్ ప్రకటించిన వారు సహకరిస్తారా? లేక ఏది అయితే అది అయింది చిత్ర యూనిట్ పోటీ ఉన్నా సరే విడుదల చేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. మరికొద్ది సేపట్లోనే చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల వాయిదాపై ప్రకటన చేసే అవకాం ఉంది. ఈ పరిస్థితుల్లో వాయిదా తప్ప మరో మార్గం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి మొదటి వారంలో సినిమా విడుదల అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ శనివారం నాడు ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ మారిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.