అధిక టిక్కెట్ ధరలు..ఓటీటీలోనూ అదనపు వడ్డింపులు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ తీవ్ర విమర్శలపాలైన అంశాలు. సినీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో అసలుకే మోసం వస్తుందని అందరూ సర్దుకుంటున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ సినిమా ఎఫ్3కి అదనపు రేట్లు ఉండవని..సర్కారు అనుమతించిన ధరలకే సినిమా ప్రదర్శిస్తామని తెలిపారు. బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా మే 20 నుంచి జీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో కెజీఎఫ్ 2 ఉంది. ఈ రెండు సినిమాలు ఓటీటీలోనూ డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించాయి. అయితే దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తటంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నిర్ణయం మార్చుకున్నట్లు కన్పిస్తోంది.
జీ5 సబ్ స్కైబర్లు ఉచితంగానే సినిమా చూడొచ్చని తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకూ ఏ ఓటీటీ సబ్ స్క్రైబర్ అయినా అందులో వచ్చే సినిమాలు..ఇతర కంటెంట్ అంతా ఉచితంగానే చూసే వెసులుబాటు ఉండేది భారత్ లో డబ్బులు చెల్లించి ఓటీటీలో సినిమాలు చూసే విధానం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే కెజీఎఫ్ 2 చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకూ తన నిర్ణయం మార్చుకున్నట్లు కన్పించటంలేదు. పోనీ నేరుగా ఓటీటీలో విడుదల చేసి అందుకు డబ్బులు వసూలు చేశారంటే అదో లెక్క. కానీ థియేట్రికల్ బిజినెస్ పోగా..మళ్ళీ ఓటీటీలోనూ కుమ్మేయాలని చూడటం విమర్శలకు కారణమైంది. ఆర్ఆర్ఆర్ లాగానే కెజీఎఫ్ 2కూడా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే.