సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బ్యానర్ పై ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు పెరుగుతాయి. రోమాంచకం సినిమాలో హీరో..హీరోయిన్ల బలం కంటే సందీప్ రెడ్డికి చెందిన భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో పాటు హీరో విజయదేవరకొండ కూడా పాల్గొనటం దీనికి మరింత బలం ఇచ్చింది. సినిమా ట్రైలర్ కూడా ఏదో కొత్తగా ఉంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. రోమాంచకం మూవీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నా బుధవారం రాత్రి హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ వేశారు. ఒక సింపుల్ కథ ను తీసుకుని దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. ఇక మూవీ కథ విషయానికి వస్తే హీరో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్ తో కలిసి రోమాంచకం అనే ఒక స్టార్టప్ మొదలుపెడతాడు. దీని ద్వారా పెళ్లిచేసుకోకుండా ఒక్క అబ్బాయి కూడా మిగలకూడదు అనే టార్గెట్ తోనే దీన్ని తెస్తున్నట్లు చెపుతాడు.

                                    ఇదే యాప్ ద్వారా హీరో కు హీరోయిన్ పరిచయం అవుతుంది. ఫస్ట్ కేవలం మెసేజ్ ల ద్వారా మొదలైన పరిచయం తర్వాత నంబర్లు షేర్ చేసుకుని మాట్లాడుకోవటంతో అది ప్రేమగా మారుతుంది. తన ప్రియురాలికి బర్త్ డే సర్ప్రైజ్ ఇద్దామని హీరో హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరి వెళ్తాడు. హీరో ఉన్న హోటల్ కు వస్తానని చెప్పిన ప్రియురాలు రాకపోగా...నెంబర్ తో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తుంది. దీంతో హీరో గా నిరాశగా వెనుతిరుగుతాడు. మరి తర్వాత వీళ్లిద్దరి ప్రేమ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే రోమాంచకం మూవీ. ఈ సినిమాను దర్శకుడు కథ కంటే ఎక్కువ శాతం కామెడీనే నమ్ముకుని నడిపించాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో కొద్దిసేపు తప్ప తర్వాత సినిమా అంతా జోష్ లోనే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గినా ఫీలింగ్ కలుగుతుంది. అయినా కూడా ఎక్కడా మరీ బోర్ కొట్టకుండా సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు.

                                       ఒక వైపు ఏ మాత్రం ముందుకు కదలని స్టార్టప్ ప్రాజెక్ట్ పై తంటాలు పడుతూనే...ప్రేమను దక్కించుకునే క్రమంలో సంఘర్షణపడే యువకుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ తన నటనతో ఆకట్టుకుంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జోడి బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాను డ్రైవ్ చేసింది అంటే హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ టీమే. ఈ టీం చేసే కామెడీతోనే మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా రోమాంచకం సినిమా యువత ను టార్గెట్ గా చేసుకుని తెరకెక్కించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. దర్శకుడు తన తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను రెండు గంటలకు పైగా బాగానే ఎంగేజ్ చేసి సక్సెస్ కొట్టాడు .

                                                                                                                                రేటింగ్: 3 /5

Tags: