థియేటర్లలోకి వరస పెట్టి సినిమాలు వస్తున్నాయి. కరోనా భయం వీడి నిర్మాతలు థియేటర్లలో సినిమాల విడుదలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పుడు రెడ్ వంతు వచ్చింది. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని, జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించారు.
నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ సెన్సార్ పూర్తి అయిన అంశంపై మాట్లాడుతూ "ఈరోజే సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. అన్ని థియేటర్స్ లోను ట్రైలర్ ప్రదర్శితమవుతూ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది" అన్నారు.