విజయదేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా రణబాలి. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా...వీళ్లిద్దరి మూడవ సినిమా కావటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సినిమా అంతా కూడా రాయలసీమలోని కరువు ప్రాంతాల చుట్టూనే తిరుగుతుంది. బ్రిటిషర్లు దేశంలోని ఆహార నిల్వలను అడ్డగోలుగా తమ దేశానికి ఎలా తరలించుకు వెళ్లారు...దీంతో సింగనమల తో పాటు రాయలసీమలోని పలు జిల్లాల ప్రజలు తిండి లేక ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. తమ ప్రజలు తిండి లేక అల్లాడిపోతుంటే...బ్రిటిషర్లు తమ ధాన్యం తరలించుకుపోవటాన్ని అడ్డుకుంటాడు సింగనమల బెబ్బులి రణబాలి పాత్రలో కనిపించిన విజయదేవరకొండ. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపిస్తుంది.

                                    హీరో కు తన జీవితంలో  ఎదురయ్యే పెను సవాల్ ను దాచిపెట్టి జయమ్మతో పెళ్లి చేస్తారు. దేశ సంపద ను దోచుకెళ్లే టీం కు నాయకత్వం వహించే రోల్ లో విలన్ గా ఆర్నాల్డ్ వోస్లూ నటించాడు. రణబాలి పాత్రలో విజయదేవరకొండ, జయమ్మ గా రష్మిక తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండే స్క్రీన్ స్పేస్ సినిమాలో చాలా తక్కువే అయినా ఉన్నంత సేపు ఆకట్టుకుంటారు. ఈ మూవీలో ఎక్కువ భాగం డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. ఏ ప్రాంతానికి చెందిన కథ అయినా కూడా అన్ని ప్రాంతాలవారిని..ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పటంలోనే దర్శకుడు ప్రతిభ బయటపడుతుంది. కానీ రణబాలి విషయానికి వస్తే తీవ్రమైన కరువు...ఆకలి చావులు వంటి సన్నివేశాలు అవసరానికి మించి మరీ ఎక్కువగా చూపించి ఇది సినిమా అన్న ఫీలింగ్ లేకుండా చేశారు.

                                            బ్రిటీషర్ల తో పోరాడే సన్నివేశాలు...హీరో, హీరోయిన్ల పాత్రలు ఒకే అనిపించినా కూడా ఈ పీరియాడిక్ డ్రామా రణబాలి మూవీ లో హై ఇచ్చే సన్నివేశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చేసినా కూడా ఇవేమి సినిమా ను నిలబెట్టలేకపోయాయి. హీరో విజయదేవరకొండ ఈ మూవీ కోసం కష్టపడినట్లు స్క్రీన్ పై చూసినవాళ్లకు స్పష్టంగా కనపడుతున్నా కూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు అనే చెప్పాలి. ఈ పీరియాడిక్ మూవీ పై విజయదేవరకొండ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. కానీ అవి ఫలించినట్లు కనిపించటం లేదు. దీంతో రణబాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కష్టంగానే కనిపిస్తోంది.

                                                                                                                                  రేటింగ్ : 2 .25 /5 

Full View

Tags: