అల్లరి నరేష్ కామెడీ ఫాంటసీ మూవీ హిట్ కొట్టిందా?!(Rambha Urvashi Menaka Review)
అల్లరి నరేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో కామెడీ సినిమాలకే పరిమితం అయిన హీరో గా ముద్రవేసుకున్నాడు. తర్వాత తర్వాత విభిన్న జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో కొన్ని మంచి ఫలితాన్ని ఇవ్వగా...మరికొన్ని నిరాశపర్చాయి. అల్లరి నరేష్ ఇప్పుడు మరో సారి ఫాంటసీ కామెడీ మూవీ రంభ..ఊర్వశి..మేనక తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు చంద్ర మోహన్ తెరకెక్కించిన ఈ మూవీ లో అల్లరి నరేష్ కు జోడిగా సురభి నటించింది. టైటిల్ రోల్ పాత్రల్లో రాశి సింగ్, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్ నటించారు. సినిమా కథ విషయానికి వస్తే అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచే తన తండ్రి కలకని కాలేక పోయిన హీరో అవుదామని ప్రయత్నం చేస్తాడు. దీని కోసం కష్టపడకుండా...తమ ఇంట్లో ఉండే మ్యాజిక్ బుక్ పై ఉన్న పజిల్ ను క్రాక్ చేయగలిగితే తనకు రంభ..ఊర్వశి, మేనక ప్రత్యక్షం అవుతారు అని గట్టిగా నమ్ముతాడు. అందులో భాగంగానే తన ఇంట్లో వీళ్ళ విగ్రహాలతో నిత్యం పూజలు చేస్తుంటాడు.
ఎన్ని సార్లు చేసినా కూడా ఆ మ్యాజిక్ బుక్ ప్రయోగం ఫలించదు. ఏమీ పని చేయకుండా ఉండటంతో ఊరంతా అప్పులు అవుతాయి హీరోకి. ప్రేమ సఫలం కావాలంటే ఊళ్ళో ఉన్న అన్ని అప్పులు తీరిస్తే తప్ప పెళ్ళికి అంగీకరించను అని సురభి తండ్రి షరతు పెడతాడు. చివరకు హీరో చేసిన పూజలు ఫలించి రంభ..ఊర్వశి, మేనక ప్రత్యక్షం అవుతారు. దీంతో హీరో కష్టాలు తీరిపోయి...ప్రేమ సఫలం అయిందా లేదా అన్నదే ఈ మూవీ. ఈ మూవీ టైటిల్ చూస్తే ఈ సినిమా అంతా ఏదో సరదా సరదా గా ఉంటుంది అని ప్రేక్షకులు ఎక్కువ మంది అనుకుంటారు. కానీ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా జోష్ లేకుండా చాలా నీరసంగా ముందుకు సాగుతుంది. దీని ప్రధాన కారణం కథనంలోని బలహీనత.
ఈ మూవీ అంతా కూడా ఓల్డ్ ఫార్ములాతో నే సాగుతుంది. ప్రేక్షకులు ఈ తరహా కథను గతంలో చాలాసార్లు చూశారు. స్లో నేరేషన్ ఈ సినిమాకు మరో ప్రధాన బలహీనతగా మారింది. అక్కడక్కడా సీనియర్ నరేష్ డైలాగ్స్, యాక్షన్స్ మాత్రమే సినిమాలో కాస్త నవ్వు తెప్పిస్తాయి. అయితే రంభ..ఊర్వశి, మేనక పాత్రల్లో కనిపించిన రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ లను ఎక్కడా వల్గారిటీ లేకుండా గ్లామరస్ గా చూపించారు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, తారక్ పొన్నప్ప లు నటించారు. ఓవరాల్ గా చూస్తే రంభ..ఊర్వశి, మేనక మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.