ప్రజలందరికీ తెలిసిన ఒక కథను వెండి తెరపైన చూపించటం...చెప్పటం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ రామాయణం లాంటి కథను చెప్పాలంటే అది ఒక సాహసం కిందే లెక్క. ఎందుకంటే ఎక్కడైనా లెక్క తేడా వస్తే పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అయినా సరే దర్శకుడు నితీష్ మల్హోత్రా ఈ సాహసం చేశారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో రామాయణ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. అందులో ఫస్ట్ పార్ట్ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. రామాయణ సినిమా తెలుగు లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఇందులో రాముడిగా నటించిన రణబీర్ కపూర్ రాముడి పాత్రకు ఏ మాత్రం సెట్ కాలేదు అని...సీత గా నటించిన సాయి పల్లవి అసలు ఈ పాత్రకు సరికాదు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది. ఈ తరుణంలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే ఒకింత కత్తిమీద సామే. అయితే రామాయణ చిత్ర యూనిట్ ఈ విషయంలో విజయం సాధించింది అనే చెప్పాలి.

                                   తెలిసినా సరే రాముడి కథను వెండితెరపై చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా వంద కోట్ల రూపాయలను అధిగమించాయి. ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా తో పాటు పాన్ ఇండియా హీరో ...రామాయణ సినిమాలో రావణుడిగా నటించిన యష్ నిర్మాతలుగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ సినిమాను రావణాసురుడు సీతను అపహరించుకుపోయిన ఘటనతో ముగించాడు దర్శకుడు నితీష్ తివారి. ఆ సమయంలోనే లంక కు వెళ్ళటం ఎంత కష్టం అయినా సరే వెళ్లి సీతను వెనక్కి తీసుకువస్తాను అని రాముడి శపధం చేసే సన్నివేశంతో ఫస్ట్ హాఫ్ కు ఎండ్ కార్డు వేస్తారు. రామాయణ ఫస్ట్ పార్ట్ మూవీ విషయానికి వస్తే ఇందులో రాముడి పాత్ర కంటే రావణాసురుడి పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి...ఆ క్యారక్టర్ బాగా వర్క్ అవుట్ అయింది.రావణాసురుడి రోల్ లో యష్ తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. రాముడిగా రణబీర్ కపూర్ కూడా ఆకట్టుకున్నాడు. రాముడి కంటే లక్ష్మణుడిగా కనిపించిన రవి దుబె ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాడు.

                                          సీత పాత్రలో కనిపించిన సాయి పల్లవి ఈ పాత్రలో అద్భుతం అని చెప్పలేము కానీ...పర్వాలేదు అని అనిపిస్తుంది. అయితే రామాయణ సినిమా విషయంలో హై లైట్ ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ కూడా గ్రాండ్ గా ఉంది. కథకు అనుగుణంగా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించినట్లు స్పషంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్, శోభన లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాజల్ అగర్వాల్ రోల్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే చెప్పాలి. నేటి తరానికి రామాయణాన్ని కథగా చెప్పటం కంటే ఇలా వెండి తెరపై చూపించే ప్రయత్నం చేయటం ఒక మంచి ప్రయోగం అనే చెప్పాలి. రామాయణ సినిమా విషయంలో దర్శక, నిర్మాతల ప్రయత్నం ఫలించింది అనే చెప్పాలి.

                                                                                      రేటింగ్ : 3.75 /5 

                                                                                                Full View

Tags: