Full Viewరామ్ చరణ్ ...సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సంచలన విజయం నమోదు చేసుకుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. రంగస్థలం నిర్మించిన మైత్రి మూవీ మేకర్సే ఆర్ సి 17 పేరుతో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు నిర్మాణ సంస్థగా ఉంది. నవంబర్ 1 న అంటే ఆదివారం నాడు హైదరాబాద్ లో ఈ నూతన సినిమా సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించే హీరోయిన్ ...మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయాలను చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆర్ సి 17 పూజా కార్యక్రమంలో దర్శకులు బుచ్చిబాబు, మలినేని గోపీచంద్, హరీష్ శంకర్, వశిష్ట, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప 2 తర్వాత దర్శకుడు సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తుండటంతో ఈ మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

                                     పుష్ప సినిమా రెండు భాగాలు అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయి లో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్ సి 17 ద్వారా రామ్ చరణ్ కు సుకుమార్ ఎలాంటి సినిమాను అందిస్తాడు...ఈ సినిమాతో రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లినా కూడా సోలో సినిమాతో ఈ ఇమేజ్ తెచ్చుకోవటం అన్నది ఇప్పుడు కీలకం కానుంది. రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది. కాకపోతే ఓవర్సీస్ తో పాటు హిందీ మార్కెట్ లో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది ఈ సినిమా.

Tags: