
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న తేడా జరిగినా ఎవరూ వదలటం లేదు. మీకు ఎందుకు అన్నీ ...సినిమా నచ్చితే చూడండి..లేదంటే వదిలేయండి అన్నా కూడా ఎవరూ ఊరుకోవటం లేదు. కావాలని చేసే విమర్శలు కూడా కొన్ని ఉంటాయి. అలాగని అన్నీ అదే బాపతు అనలేం. రామ్ చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న మూవీ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబదించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా కు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు పెద్ది అనే టైటిల్ నే ఖరారు చేశారు. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ అచ్చం పుష్ప 2 సినిమా లో అల్లు అర్జున్ లుక్ లాగా ఉండటంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గురువారం నాడు రామ్ చరణ్ పుట్టిన రోజు కావటంతో ఒక వైపు అయన విషెష్ చెపుతూనే పెద్ది ఫస్ట్ లుక్ ...పుష్ప సినిమా అల్లు అర్జున్ లుక్ ను పోలి ఉంది అని...కొత్తగా అనిపించలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ కామెంట్స్ లో కొంత నిజం లేకపోలేదు. పెద్ది ఫస్ట్ లుక్ అచ్చం అల్లు అర్జున్ పుష్ప లుక్ స్టైల్ లోనే ఉంది. దీంతో ఈ విషయం ప్రేక్షకులకు ఈజీ గా కనెక్ట్ అవుతుంది అనటంలో సందేహం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంటే ఈ సినిమా కు ఏ ఆర్ రెహెమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లో శివ రాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అల్లు అర్జున్ హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో...అంతే స్థాయిలో వివాదాలు కూడా రేపింది. ఈ సినిమా తో అల్లు ఫ్యామిలీ, మెగా స్టార్ ఫ్యామిలీ మధ్య గ్యాప్ మరింత పెంచింది అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ పుష్ప 2 లుక్ ను పోలి ఉండటంతో ఇప్పుడు రామ్ చరణ్ కు కొత్త తలనొప్పి మొదలైంది అనే చెప్పాలి. ఇది రామ్ చరణ్ పదహారవ సినిమా. అయితే ఫస్ట్ లుక్ నుంచే దీనిపై వివాదాలు తలెత్తడం రామ్ చరణ్ ఫాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది అనే చెప్పాలి.