రాజ‌మౌళికి పోటీగా ప్ర‌శాంత్ నీల్!

Update: 2022-04-15 04:37 GMT

Full Viewకొన్ని సినిమాలు హీరోని చూసి ఆడతాయి. మ‌రికొన్ని ద‌ర్శ‌కుడిని చూసి ఆడ‌తాయి. ఓ అగ్ర‌హీరో..అగ్ర ద‌ర్శ‌కుడు క‌లిస్తే ఆ సినిమాకు మ‌రింత క్రేజ్ వ‌స్తుంది. ఇలా హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో త‌న సినిమాకు ఓ రాజ‌ముద్ర‌లాగా త‌న పేరును వేసుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న సినిమాల్లో ఫెయిల్యూర్స్ లేవనే చెప్పాలి. హీరోకు అయినా..ద‌ర్శ‌కుడు అయినా ఆయ‌న చేసిన ..తీసిన సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా లాభాలు సాధిస్తే అది హిట్ గానే ప‌రిగ‌ణించాలి. ఏ సినిమా కూడా అంద‌రికీ న‌చ్చ‌దు. స‌క్సెస్ ఫార్ములా అంటే డ‌బ్బులు వ‌చ్చాందా లేవా అన్న‌దే. ఉదాహ‌ర‌ణ‌కు ఆర్ఆర్ఆర్ సినిమానే తీసుకుందాం. ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు న‌టించారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ చాలా మందికి న‌చ్చ‌లేదు. కానీ క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్. రాజ‌మౌళి ఎలాగో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్ర‌శాంత్ నీల్ పేరు మారుమోగిపోతోంది. కెజీఎఫ్‌, కెజీఎఫ్ చాప్ట‌ర్ 2ల‌తోనే ఆయ‌న రాజ‌మౌళి రేంజ్ కు వెళ్ళార‌నే చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే కెజీఎఫ్ 2 చాప్ట‌ర్ లో ఆయ‌న చూపించిన స‌న్నివేశాలు, ఎలివేష‌న్స్ అలా ఉన్నాయి మ‌రి. లాజిక్ ల‌తో సంబంధం లేకుండా యాక్షన్ కోరుకునే ప్రేక్షకుల‌ను ఆ సీన్ల‌ను అలా ఎంజాయ్ చేశారు మ‌రి. రాణిలా చూసుకుంటాన‌ని చెప్పావు..నాకు ఇక్క‌డ గాలి కూడా రావ‌టం లేదు అంటూ కెజీఎఫ్ 2లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెపితే...ఆమె కూర్చున్న పైన గాలి కోసం హెలికాప్ట‌ర్ ను తిప్పుతాడు. ఈ త‌ర‌హా సీన్ ఎవ‌రూ ఊహించ‌రు.

మ‌ళ్ళీ అందులోనూ కామెడీ చూపించ‌రు. అక్క‌డ‌కు హెలికాప్ట‌ర్ వ‌చ్చే స‌మ‌యంలో హీరో యశ్ అక్క‌డ ఉన్న మహిళ‌ల‌తో అమ్మా అప్ప‌డాలు జాగ్ర‌త్త అని చెబుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాలో ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌నంత ఎత్తుకు చేరిపోయార‌నే చెప్పాలి. రాజమౌళితో పోలిస్తే ప్ర‌శాంత్ నీల్ తీసిన సినిమాలు చాలా త‌క్కువే అయినా ఇప్పుడు ఆయ‌న్ను అంద‌రూ రాజ‌మౌళితో పోలుస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజ‌మౌళి అయినా..ప్ర‌శాంత్ నీల్ అయినా ఇక ప్ర‌తి అడుగు మ‌రింత జాగ్ర‌త్త‌గా వేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా రాజ‌మౌళికి తిరుగులేని ద‌ర్శ‌కుడు అని పేరుండేది. ఇప్పుడు అది ప్ర‌శాంత్ నీల్ రూపంలో మ‌రో పోటీ ఎదురైంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ప్ర‌భాస్ తో క‌ల‌సి సాలార్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్ తో కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించే అవ‌కాశం ఉంది. అటు రాజ‌మౌళి, ఇటు ప్ర‌శాంత్ నీల్ లు ఇలా పోటీలు ప‌డి సినిమాలు తీసి సినిమా ప్రేక్షకుల‌ను ఆల‌రిస్తూ ఎవ‌రు ముందు వ‌ర‌స‌లో నిలుచుంటారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News