ఎవరూ ఊహించని రీతిలో అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడటం టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. ఎందుకంటే నిర్మాతల ఆర్థిక సమస్యల కారణంగా బాలకృష్ణ సినిమా ఒకటి రిలీజ్ కు ముందు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత బ్రేక్ లు పడతాయని ఎవరూ ఉహించకపోవటమే అందరూ అవాక్కు అయ్యేలా చేసింది. ఈ వాయిదా తర్వాత సోషల్ మీడియా లో రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. వచ్చే సంక్రాంతి రిలీజ్ ల్లో అందరి దృష్టి ఉన్న సినిమా అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ రాజాసాబ్ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత టి జి విశ్వప్రసాద్ పలు మార్లు అధికారికంగా ప్రకటించారు. జనవరి తొమ్మిదిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని. అఖండ 2 వాయిదా తర్వాత మళ్లీ రాజాసాబ్ విడుదల కూడా సంక్రాంతికి ఉండకపోవచ్చు అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా మరో సారి విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను తాము ఇప్పటికే క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం అని నిర్మాత విశ్వ ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రచారం జరుగుతున్నట్లు రాజాసాబ్ సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ లేదు అన్నారు.
విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై అది ప్రభావం చూపుతుంది అని తెలిపారు. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ లో విడుదల అయ్యే సినిమాలతో పాటు సంక్రాంతికి వచ్చే రాజాసాబ్ తో పాటు మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఇలా అన్ని సినిమాలు మంచి విజయం సాధించాలన్నారు.