డిసెంబర్ నుంచి జనవరికి మారే అవకాశం

Update: 2025-08-06 05:00 GMT

టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఏ సినిమా కూడా చెప్పిన డేట్ కు విడుదల అవుతున్న దాఖలాలు లేవు. కారణాలు ఏమైనా కూడా పెద్ద సినిమా లు చాలా వరకు విడుదల తేదీలు మార్చుకున్న తర్వాతే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద మరో పోటీ సినిమా లేకుండా నిర్మాతలు చూసుకుంటున్నారు. మరి కొన్ని సార్లు అనుకున్న సమయానికి షూటింగ్ తో పాటు ఇతర పనులు పూర్తి కాక సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రాజాసాబ్ సినిమా విషయంలో కూడా అదే జరిగేలా కనిపిస్తోంది. కాకపోతే ముందు ప్రకటించిన దానికి ..కొత్త విడుదల తేదికి మరీ పెద్దగా గ్యాప్ ఏమి ఉండటం లేదు అనే చెప్పొచ్చు. దర్శకుడు మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అనటంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

                                                        అయితే ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్లు ఈ సినిమా నిర్మాత ..పీపుల్స్ మీడియా అధినేత టి జీ విశ్వప్రసాద్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ రాజాసాబ్ సినిమా సంక్రాంతికి వస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది కోరుకుంటున్నారు అని చెప్పారు. అయితే హిందీ మార్కెట్ నుంచి మాత్రం ముందు చెప్పిన డిసెంబర్ ఐదు తేదీన విడుదల చేయాలనే డిమాండ్ ఉంది అన్నారు.

                                      సినిమా షూటింగ్ అంతా పూర్తి అయింది అని...కొన్ని పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది అని విశ్వప్రసాద్ వెల్లడించారు. రాజాసాబ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అని...ఈ సినిమా కు ఖచ్చితంగా పార్ట్ 2 కూడా ఉంటుంది అని తెలిపారు.రాజాసాబ్ సినిమా కోసం దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హవేలీ రాజమహల్ సెట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దీన్ని మీడియా కు చూపించారు కూడా. అయితే రాజాసాబ్ సినిమా నిర్మాతలు మాత్రం ఈ మూవీ విడుదల తేదీ మార్పు విషయంలో మార్పు చేయటానికే ఆసక్తితో ఉన్నట్లు కనిపిస్తోంది అని చెపుతున్నారు. సహజంగా సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడూ పోటీ గట్టిగానే ఉంటుంది. అయితే ప్రభాస్ సినిమా పండగ డేట్ ఖరారు చేసుకుంటే మాత్రం మిగిలిన సినిమాలు వెనక్కి తగ్గినా ఆశ్చర్యం ఉండదు అని చెపుతున్నారు. సంక్రాంతి బరిలో నిలిస్తే రాజాసాబ్ జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News