ఆర్ఆర్ఆర్ బాటలోనే రాధే శ్యామ్ కూడా. ఊరించి ఊరించి వాయిదా ప్రకటన చేశారు. తొలి నుంచి సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గేదిలేదంటూ ప్రకటించిన చిత్ర యూనిట్ బుదవారం నాడు అధికారికంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సినిమా విడుదలకు తాము గత కొన్ని రోజులుగా పలు చర్యలు తీసుకున్నామని..కానీ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వెండితెరపై ఈ సినిమా చూడాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి ఉందని అంటూ పేర్కొంది. రాధేశ్యామ్ సినిమా ప్రేమ, విధిలకు సంబంధించిన కథ అని ..మీ ప్రేమ ఈ కష్ట కాలాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవటంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
త్వరలోనే సినిమా థియేటర్లలో కలుద్దాం అంటూ ప్రకటన చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. వాస్తవానికి సంక్రాంతి దగ్గర కొస్తున్నా చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచకపోవటంతో అభిమానులకు ఇప్పటికే అనుమానాలు వచ్చాయి. అందుకు చిత్ర యూనిట్ ఏ విషయం అయినా స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ వాయిదాపై అధికారిక ప్రకటన చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఇదే తరహాలో బారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించింది. పలు రాష్ట్రాల్లో థియేటర్లను 50 శాతం సామర్ధ్యంతో అనుమతి ఇస్తుండటం..మరికొన్ని చోట్ల పూర్తిగా మూసివేయటంతో పాన్ ఇండియా సినిమాలు అయిన ఈ రెండూ వాయిదా బాట పట్డాయి.