అల్లు అర్జున్, రష్మిక మందనలు నటించిన సినిమా పుష్ప తొలి వారంలో రికార్డు స్థాయి వసూళ్ళతో దూసుకెళుతోంది. 2021 సంవత్సరంలో దేశంలోనే అతి పెద్ద గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి వారంలో 229 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పుష్ప ద రైజ్ తొలి భాగంలో అల్లు అర్జున్ నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తొలిసారి ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ తన సత్తా చాటాడు. రష్మిక సైతం డీగ్లామర్ పాత్రలో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం టిక్కెట్ రేట్ల వ్యవహరం కారణంగా పుష్ప బయ్యర్లపై కూడా ప్రభావం పడినట్లు సమాచారం.
ఏపీలో పుష్ప సినిమా బయ్యర్లు 30 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంత పాజిటివ్ టాక్ లోనూ పుష్ప ఏపీలో బయ్యర్లకు నష్టాలు మిగుల్చుతుంది అంటే...ధరల వ్యవహారం ఎంత ప్రభావం చూపిస్తుందో కన్పిస్తోందని అంటున్నారు. అఖండ సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశమంతటా బయ్యర్లు లాభాలు గడించగా..ఒక్క ఏపీలో మాత్రం టిక్కెట్ రేట్ల కారణంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రభావం మరింత మందిపై పడే అవకాశం ఉందని అంటున్నారు.