ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ లేఖ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిని కోరారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల రోజు రౌడీయిజం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్లలోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది అని భావిస్తున్న తరుణంలో ఎప్పుడుకప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. తమకు ఎన్నికల రోజునాటి సీసీటీవీ ఫుటేజీ కావాలంటూ ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ గురువాం నాడు లేఖ రాశారు.
ఎన్నికల రోజు మొత్తం సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారని..ఇది బయటపెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మోహన్ బాబు, నరేష్ లు కొంత మందిపై దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపణలు చేశారు. ఈ లేఖపై ఎన్నికల అధికారి క్రిష్ణమోహన్ స్పందించారు. నిబంధనల మేరకు సీసీటీవీ ఫుటేజ్ అందిస్తామన్నారు. ఇది భద్రంగా ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.