మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు అందరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గెలిచిన మంచు విష్ణు ప్యానల్ మంచిగా పనిచేయాలని..ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. విష్ణుతోపాటు ఆయన కమిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకే తాముఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రాస్ ఓటింగ్ జరిగి..రెండు ప్యానళ్ల నుంచి అటు కొంత మంది..ఇటు కొంత మంది గెలిచారన్నారు. మా సభ్యుల సంక్షేమ కోసమే ఈ నిర్ణయం అన్నారు. తాము బయటి నుంచి ప్రశ్నిస్తామని..మా సభ్యులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం జరిగిందని, సీనియర్ సభ్యుడు బెనర్జీపై కూడా మోహన్ బాబు చేయిచేసుకున్నారని ఆరోపించారు ప్రకాష్ రాజ్. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దగ్గర పొరపాట్లు జరిగాయని, కొంత మంది విమానాల్లో తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. గతంలో కూడా మా ఎన్నికల్లో ఒకే ప్యానల్ గెలవకపోవటం వల్ల పలు సమస్యలు వచ్చాయని..ఈ సారి అలాంటి సమస్యలు రాకూడదు..విష్ణు కమిటీ మరింత మెరుగ్గా పనిచేయటానికి ఇది దోహదపడుతుందని అన్నారు.
తన రాజీనామాను విష్ణు ఆమోదించనని చెప్పారని..అయితే బై లాస్ లో ఇతర రాష్ట్రాల వ్యక్తులు కేవలం ఓటు వేయటానికి తప్ప..పోటీ చేయటానికి పనికిరారు అనే నిబంధన పెట్టకపోతేనే దీన్ని ఆమోదిస్తానని తెలిపారు. నిర్ణయం మంచు విష్ణుదే అన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున మంచు విష్ణుకు ఓ లేఖ రాశారు. నరేష్ మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్లే చాలా సమస్యలు వచ్చాయని..అదే సమస్య మళ్లీ తిరిగి రాకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక ప్యానల్ కాదు కాబట్టి తాము కమిటీలో ఉండి ప్రశ్నించటం..కొత్త సమస్యలు వస్తాయని..వీటిని నివారించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే తమను గెలిపించిన సభ్యుల కోసం మాలో చెప్పినట్లు డెవలప్ చేయకపోయినా..సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తూ ఉంటామన్నారు.ఈ మీడియా సమవేశంలో సీనియర్ నటుడు బెనర్జీ కన్నీళ్లుపెట్టుకున్నారు. మోహన్ బాబు తనపై దాడి చేయటానికి రావటంతోపాటు బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.