పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటే సహజంగా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. దీనికి కారణం వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపటమే. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అని కథను మార్చి మరీ ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల్లో ఇదే చివరి సినిమా కూడా. కొద్దినెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల పరంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం పై పడింది. భారీ అంచనాల మధ్య ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది అనే చెప్పాలి.
అత్యంత రొటీన్ కథ తో దర్శకుడు హరీష్ శంకర్ సినిమాను ఏదో చుట్టేయాలి అని చుట్టేసినట్లే కనిపిస్తుంది తప్ప...సినిమా మొత్తంలో ఎక్కడా కూడా వావ్ మూమెంట్స్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా కనిపించవు. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా కథలో దమ్ములేకపోవటంతో దాని ఫలితం కూడా పెద్దగా లేకుండా పోయింది అనే చెప్పాలి. కాస్తో కూస్తో థియేటర్ లో కాస్త జోష్ నింపింది మాత్రం ఆ మ్యూజిక్ అనే చెప్పాలి. సినిమా లో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. మూవీ క్లైమాక్స్ లో ఇటీవల చోటుచేసుకున్న ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్ ను జొప్పించి కథకు ముగింపు పలికారు.
ఇక హీరోయిన్స్ శ్రీలీల, రాశీ ఖన్నా ల పాత్రల గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు. శ్రీ లీల ఎంట్రీనే సెకండ్ హాఫ్ లో ఉంటుంది. కాస్తో కూస్తో సినిమాలో నవ్వు తెప్పించింది అంటే రాశీ ఖన్నా నల్లమల అడవుల్లో సత్యం రాజేష్, ప్రవీణ్ లు చేసే సందడే అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ ఒకింత ఓకే అనిపించినా ....సెకండ్ మరింత బోర్ కొట్టిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన పార్తీబన్ పాత్ర కూడా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన తరహా పాత్రే తప్ప...ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదు. పవన్ కళ్యాణ్ ని మరింత ఎలివేట్ చేసేలా సినిమాలో అక్కడక్కడ పొలిటికల్ డైలాగులు జొప్పించారు. మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కూడా పెద్దగా జోష్ నింపలేకపోయింది అని చెప్పొచ్చు.