ఓజీ సినిమా తో పవన్ కళ్యాణ్ కొత్త రికార్డు నమోదు చేసుకున్నారు. ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా ఓజీ మూవీ నిలిచింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నాలుగు రోజుల్లో ఇప్పటి వరకు 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. తర్వాత అసలు ఈ వసూళ్ల వివరాలను అధికారికంగా షేర్ చేసుకోలేదు ఈ సంస్థ. ఫస్ట్ డే తర్వాత రెండవ రోజు వసూళ్లు బాగా తగ్గినా...తర్వాత వీకెండ్స్ లో అంటే శనివారం, ఆదివారం మాత్రం ఓజీ మంచి ఫలితాలను సాధించింది. అయితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయింది లేనిదీ తేల్చేది సోమవారం నాటి ఫలితాలే. అయితే హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే సోమవారం దగ్గర అన్ని థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయని చెప్పాలి. కొన్ని చోట్ల మాత్రం ఈవెనింగ్ షోస్ కు బుకింగ్స్ కాస్త పర్వాలేదు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ఒకటి రెండు వందల కోట్ల మార్క్ ను దాటింది కూడా ఇదే. వీకెండ్స్ జోష్ తో ఈ మూవీ కలెక్షన్స్ 230 కోట్ల రూపాయలకు చేరినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. మండే ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో కలెక్షన్స్ క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర అమెరికాలోనే ఓజీ కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. ఓజీ సినిమాతో పాన్ ఇండియా స్థాయి కి వెళ్లాలనుకున్న పవన్ కళ్యాణ్ కల నెరవేరలేదు అనే చెప్పాలి. ఎందుకంటే హిందీ మార్కెట్ లో ఓజీ పెద్దగా కలెక్షన్స్ సాదించలేకపోయింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎక్కువ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది కానీ...ఇతర ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో లేకపోవటం మైనస్ గా మారింది. పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ గా చూపిస్తూ ఎక్కువగా ఎలివేషన్స్ పైనే ఫోకస్ పెట్టారు...థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టింది. మొత్తం మీద హరి హర వీర మల్లు తర్వాత ఓజీ సినిమాతో పవణ్ కళ్యాణ్ తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల రికార్డును నమోదు చేసుకోవటంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారనే చెప్పొచ్చు.