పది రోజుల వ్యవధిలో ఆర్ఆర్ఆర్, బీమ్లానాయక్, రాధేశ్యామ్ ల విడుదల
థియేటర్ల అందుబాటు.ఏపీ సర్కారు నిర్ణయాలపై టెన్షన్
ఆర్ఆర్ఆర్. మధ్యలో బీమ్లానాయక్, ఆ తర్వాత రాధేశ్యామ్. మూడు భారీ సినిమాలు పది రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. దీంతో టాలీవుడ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ టెన్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్, రానా లు కలసి నటిస్తున్న బీమ్లానాయక్ సినిమా కారణంగా తమకు ఎక్కడ దెబ్బపడుతుందో అని ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ టీమ్ లు టెన్షన్ పడుతున్నాయి. మూడూ పెద్ద సినిమాలే. అన్నింటి కంటే ప్రధాన టెన్షన్ ఏపీ సర్కారు తమ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తుందా?. రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా టెన్షన్ వీరిలో ఉంది. సర్కారు ఏదైనా రూల్ పెడితే అందరికీ ఒకలా ఉండాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉండటంతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అన్న టెన్షన్ ఉంది వీరిలో. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను కలసి సినిమాను వాయిదా వేసేందుకు ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఎవరికీ అందుబాటులోకి రావటంలేదు. దీంతో రాజమౌళి పవన్ ను రీచ్ అయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కు చెందిన కీలక వ్యక్తులు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటు బీమ్లానాయక్ నిర్మాతలతో చర్చలు జరిపినా ఎలాంటి పలితం రాలేదని సమాచారం.
మధ్యలో ట్విట్టర్ ద్వారా బీమ్లానాయక్ విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం చేయటంతో చిత్ర యూనిట్ ఈ వార్తలను ఘాటుగా కౌంటర్ ఇవ్వటంతో ప్రత్యర్దులు తోకముడిచారు. ఈ ఏడాది దసరా సమయాన్ని పరిశ్రమలోని ప్రముఖులు అందరూ ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించి తర్వాత తమ తమ సినిమాల విడుదల ప్లాన్ చేసుకున్నారు. రకరకాల కారణాలతో ఆర్ఆర్ఆర్ దసరాకు విడుదల కాలేదు. దీంతో ఇప్పుడు మూడు సినిమాలు ఒకేసారి రానుండటంతో ఎవరి వల్ల ఎవరికి దెబ్బపడుతుందో అన్న టెన్షన్ లో ఆయా చిత్ర యూనిట్లు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా..ఆ తర్వాత జనవరి 12న బీమ్లానాయక్ విడుదల కానుంది. ఇది జరిగిన రెండు రోజులకే అంటే జనవరి 14న ప్రభాస్, పూజా హెగ్డెలు నటించిన మరో భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్ విడుదల కానుంది.
ఒక రకంగా చూస్తే ఆర్ఆర్ఆర్ కు కొంత గ్యాప్...స్పేస్ దొరికినా..బీమ్లానాయక్, రాధేశ్యామ్ లకు మాత్రం క్లాష్ తప్పేలా లేదు. అయితే సంక్రాంతి వంటి పండగల సమయంలో రెండు, మూడు భారీ సినిమాలు రావటం సహజమే అయినా..ఈ సారి అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావటంతో థియేటర్ల సర్దుబాటు..ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది అన్నదే చిత్ర యూనిట్లకు ప్రధాన టెన్షన్ గా మారింది. మరి రాజమౌళి అండ్ రాధేశ్యామ్ అండ్ టీమ్ ల వినతిని పవన్ కళ్యాణ్ ఆలకిస్తారా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రయానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కారు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్ సినిమా కారణంగా ఆ ప్రభావం తమపై ఎక్కడ పడుతుందో అని వీరు టెన్షన్ పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.