పవన్, సుజీత్ కాంబినేషన్ క్లిక్ అయిందా?! (OG Movie Review)

Update: 2025-09-25 07:47 GMT

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరిగాయో అందరికి తెలిసిందే. ఈ జోష్ తోనే ప్రీమియర్ షోస్ తో పాటు ఫస్ట్ డే షోస్ అన్ని ఫుల్ అయ్యాయి. ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ కొత్త రికార్డు లు బ్రేక్ చేస్తాడు అని ఆయన ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ గురువారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల అయిన రెండవ సినిమా ఇది. ఫస్ట్ మూవీ హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. దీంతో అందరి చూపు ఓజీ సినిమా వైపు మళ్లింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే అంతా ఎలివేషన్స్ ఎలివియేషన్స్ తప్ప ఇందులో కథ గురించో...మరో విషయం గురించో వెతికే స్కోప్ ఏ మాత్రం లేదు.

                                                హీరో పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ లుక్ లో చూపించటం..ఎలివేషన్స్ తో సినిమా ను పెంచే ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి కనిపించదు. ఈ ఎలివేషన్స్ కు థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఇది ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం మాత్రం దారుణంగా ఉండేది అనే చెప్పాలి. ఓజీ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్, థమన్ ల సినిమా మాత్రమే. దర్శకుడు సుజీత్ సినిమా మొత్తం హంగామా చేయాలనే ట్రై చేశారు తప్ప కథ..ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే అంశలపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ ల లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు.

                                                     ఆమెకు ఉన్న స్క్రీన్ స్పేస్ కూడా చాలా పరిమితంగానే ఉంది. దర్శకుడు సుజీత్ ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో అరిగిపోయిన పాత కథ మాఫియా ఆర్డీఎక్స్ దిగుమతి చేసుకుని..ముంబై లో పేలుళ్లకు పాల్పడాలనే కుట్రకు దిగటం...దీన్ని ఒక గ్యాంగ్ స్టర్ ఓజాస్ గంభీరా అడ్డుకున్నట్లు చూపించారు. కథ, కథనం లో ఏ మాత్రం కొత్తదనం ఉండదు. దీంతో ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాగానే మిగిలిపోతుంది తప్ప...ఏదో పండగ కదా ఎంజాయ్ చేద్దామంటే ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్కడా కనపడవు. ఓజీ సినిమాలో దర్శకుడు సుజీత్ తలలు నరికే సీన్స్ తో బోయపాటి శ్రీనును మించిపోయినట్లు కనిపించాడు అనే అభిప్రాయం కలగటం సహజం. రెండు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ ధరలతో సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగానే నమోదు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఇది అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా మాత్రం కాదు అనే చెప్పొచ్చు. ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం కూడా ఓజీకి  కలిసి వచ్చే అంశమే.

                                                                                                                                                 రేటింగ్ : 2 .5 /5

Tags:    

Similar News