సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా విషయంలో ఇప్పటికే హైప్ ఒక రేంజ్ కు చేరింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంటున్న గందరగోళం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురిఅవుతోంది. వాస్తవానికి ఆదివారం ఉదయమే ఈ సినిమా ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. పవన్ కళ్యాణ్ కూడా ట్రైలర్ గురించి ప్రస్తావించారు. అయినా అధికారికంగా ట్రైలర్ విడుదల అయితే సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరగలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్ టైన్మెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇప్పటివరకు ఓజీ సినిమా సెన్సార్ అయినట్లు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో టికెట్స్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి కూడా. సెన్సార్ స్క్రూటినీ జరిగినా కూడా సభ్యులు ఎక్కువ కట్స్ చెప్పటంతో పాటు ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పటంతో ఇది పెండింగ్ లో పడింది అని ...ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా రంగంలోకి దిగి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెపుతున్నారు.
సెన్సార్ పరంగా పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోయినా కూడా ఈ మూవీ కి జారీ అయ్యే సర్టిఫికెట్ ఏమి వస్తుంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఏ సర్టిఫికెట్ పై నిర్మాత దానయ్య ఆందోళన వ్యక్తం చేయటంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ డే కు హైదరాబాద్ లో బుక్ మై షో లో టికెట్స్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయి. ఈ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ఎక్కడా సెన్సార్ సర్టిఫికెట్ విషయాన్నీ ఎక్కడ ప్రస్తావించలేదు. సెన్సార్ కంప్లీట్ అయితే అదే విషయాన్నీ సినిమా జానర్ పక్కనే పెడతారు అనే విషయం తెలిసిందే. ఇటీవల హరి హర వీరమల్లు విషయంలో పలు గందరగోళాలు చోటు చేసుకున్నాయి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు ఎంతో హైప్ ఉన్న ఓ జీ విషయంలో కూడా ఈ పరిణామాలు పవన్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం మింగుడు పడటం లేదు.