సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ సినిమా. అయితే ఇది వచ్చే సంక్రాంతికి కాదు. 2026 సంక్రాంతి రేస్ లో ఎన్టీఆర్ ఉండబోతున్నారు. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ సినిమా విడుదల తేదీ ని కూడా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల 2026 జనవరి 9 న ఉంటుంది అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ తేదీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సినిమా కు రెండు సంవత్సరాలు తీసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాను ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించేది ఎవరు...ఇతర నటీనటుల విషయాలు త్వరలోనే బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ ను ఫిక్స్ చేశారు అని ప్రచారం జరిగింది. ఇందులో నిజం ఎంత ఉంది కొద్ది రోజులు పోతే కానీ తెలియాదు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా తో పాటు బాలీవుడ్ లో వార్ 2 లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కెజీఎఫ్ రెండు భాగాలతో పాటు ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయిన విషయం తెలిసిందే. దీంతో నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.