ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ అభిమానులకు అనుకోని సర్ ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న భీమ్ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ రెండు చేతులతో తాళ్ళను పట్టుకుని చిన్న లంగోటీ కట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్న ఫోటోనే ఇది. ఉదయం ఎన్టీఆర్ ఫోటోను విడుదల చేయగా..సాయంత్రం మరో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు సంబంధించి అల్లూరి సీతారామరాజు లుక్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య 450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా ఇది ఒకేసారి పలు భాషల్లో విడుదల కానుంది. తెలుగులో అలియాభట్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియో మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే.