విజయదేవరకొండ ఆశలు ఫలించాయా?!(Kingdom Movie Review)

Update: 2025-07-31 07:06 GMT

గౌతమ్ తిన్ననూరికి సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. గతంలో ఆయన తెరకెక్కించిన మళ్ళీ రావా ..జెర్సీ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు సితార ఎంటర్ టైన్మెంట్స్ హవా సాగుతోంది. మంచి సబ్జెక్టు లు సెలెక్ట్ చేసుకుని విజయాలు సాధిస్తూ ముందుకు వెళుతోంది. సితార బ్యానర్...గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా కావటంతో కింగ్డమ్ కు కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఓపెనింగ్స్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. మరో వైపు విజయదేవరకొండ కూడా ఆయన గత సినిమాలు అయిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ ల ఇమేజ్ నుంచి బయటపడి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్..మంచి బ్యానర్ దొరికినా కూడా విజయదేవరకొండ కు కాలం ఏ మాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఎందుకంటే కింగ్డమ్ సినిమా కూడా మరో సో సో సినిమాగానే మిగిలిపోనుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధం చేసుకున్న కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు గత ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ దేవర మూవీ గుర్తుకు రావటం ఖాయం.

                                                          దేవర సినిమాలో ఒక కొండ మీద ఉండే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే పెద్దల కోసం స్మగ్లింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తారు. కాకపోతే కింగ్డమ్ సినిమాలో మాత్రం శ్రీకాకుళం నుంచి చిన్నప్పుడే శ్రీలంక లోని ఒక దీవికి వెళ్లిన ప్రజలు శ్రీలంకలో ఉండే మాఫియా కోసం స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ దీవిలో ఉండే వాళ్ళను అటు శ్రీలంక ప్రభుత్వం..ఇటు భారత ప్రభుత్వం కూడా ఓన్ చేసుకోవు. అందుకే వాళ్ళు తమ మనుగడ కోసం ఆ మాఫియా చెప్పే పనులు చేస్తూ బతుకుతుంటారు. దీనికి విజయదేవర కొండ, సత్యదేవ్ ల తో అన్నదమ్ముల అనుబంధం జోడించి గౌతమ్ తిన్ననూరి కథ సిద్ధం చేసుకున్నా కూడా ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమ తమ పాత్రల పరంగా హీరో విజయదేవరకొండ, సత్యదేవ్ ల యాక్షన్ బాగానే ఉన్నా కూడా కథలో జోష్ లేకపోవటంతో ఇది అంతగా వర్క్ అవుట్ కాలేదు అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో కాస్తో కూస్తో ప్రేక్షకులకు వావ్ మూమెంట్ అంటే కానిస్టేబుల్ గా ఉన్న సమయంలో పోలీస్ ఉన్నతాధికారిపై చేయిచేసుకున్న విజయదేవరకొండను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని విచారణాధికారి అడిగిన సమయంలో విజయ్ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉంటాయి.

                                                    కానిస్టేబుల్ గా ఉన్న విజయ్ అన్న కోసం వెతుక్కుంటూ శ్రీలంక ఎందుకు వెళ్లాల్సి వచ్చింది...అక్కడ ఏమి జరిగింది అన్నదే కింగ్డమ్ మూవీ. ఈ సినిమాలో మురుగన్ పాత్రలో కనిపించిన వెంకిటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అసలు కింగ్డమ్ మూవీ లో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే రోల్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్ధం కాదు. ఈ మూవీ లో ఆమె స్క్రీన్ టైం చాలా చాలా తక్కువ. కింగ్డమ్ తో అయినా హిట్ సాధించి తాను కూడా స్టార్ హీరో ల పక్కన నిలబడాలి అనే విజయదేవరకొండ కోరిక ఈ సినిమా తో కూడా నెరవేరలేదు అనే చెప్పొచ్చు. ఇది కూడా ఆయన కెరీర్ లో ఒక రొటీన్ సినిమాగానే మిగిలిపోతుంది. అత్యంత సాదాసీదాగా సాగే ఈ సినిమా కథ..కథనాన్ని అక్కడక్కడా కాస్త ఎలివేట్ చేసింది అంటే అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. రొటీన్ స్టోరీ అయినా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా..ఆసక్తికరంగా కథ చెప్పారా అంటే అదీ లేదు.

                                                                                                                                                               రేటింగ్: 2 .5 \5

Tags:    

Similar News